కవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

కవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబం ధం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఢిల్లీ లిక్కర్​ స్కామ్..​ రాష్ట్ర బీజేపీకి సంబంధం లేని విషయం. అది​ మా పరిధిలో లేదు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి, ఎవరు అరెస్టు అవు తున్నారనేది మాకు అవసరం లేదు.. తెలంగాణలో జరుగుతున్న కుంభకోణాలపైనే మా పోరాటం. 

ఇక్కడి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ప్రజల భూములను కొల్లగొడుతున్నారు. ల్యాండ్, శాండ్, ధరణి కుంభకోణాలపై మా పోరాటం కొన సాగుతుంది. మూడు నెలల తర్వాత రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూకుంభకోణాలపై కచ్చితంగా దర్యాప్తు చేయిస్తాం’ అని కిషన్​ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్​లో ఓ హోటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మజ్లిస్​తో స్నేహం చేస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్​తో కలిసే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. 

చంద్రబాబుపై కక్ష సాధింపు కరెక్ట్​ కాదు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు​చేసేముందు మాట్లాడి ఉండాల్సిందని కిషన్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రభుత్వం సంయమనం పాటించి ఉంటే బాగుండేదన్నారు.  కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు.