
- 20 నుంచి 27 వరకు ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో ఎమ్మెల్యే
- ఏర్పాట్లపై సునీల్ బన్సల్ , కిషన్ రెడ్డి రివ్యూ
హైదరాబాద్, వెలుగు : నాలుగు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీ అధిష్టానం.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీసేందుకు వివిధ ప్రోగ్రామ్ లు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 19న ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి రానున్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో వారు ఏం చేయాలనే దానిపై అదే రోజు వారికి హైదరాబాద్ లో వర్క్ షాపు నిర్వహిస్తారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి.. అక్కడ పార్టీ పరిస్థితిని, పార్టీ నేతల బలా బలాలు, వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి.. ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలా.. అనే విషయాలను వారు ఆరా తీస్తారు. అనంతరం హైకమాండ్ కు సమగ్ర నివేదిక అందజేస్తారు. ఈ కార్యక్రమంపై శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఇన్ చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో సమీక్షించారు.
నెలాఖరులో ఖమ్మంకు అమిత్ షా
వాయిదాపడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం టూర్ ఈ నెల 27న దాదాపుగా ఖరారైనట్లు బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు చెప్తున్నారు. పార్ల మెంటరీ ప్రవాసీ యోజనలో భాగంగా ఒక్కో కేంద్ర మంత్రి రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే సభలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా టూర్ ను రాష్ట్ర పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 27న లేదంటే నెలాఖరులో ఏదో ఒక రోజు అమిత్ షా ఖమ్మం టూర్ పక్కాగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
వచ్చే నెలలో విజయ సంకల్ప యాత్రకు ప్లాన్
బీజేపీ స్టేట్చీఫ్ గా నియమితులైన కిషన్ రెడ్డి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటు ఎన్నికల ప్రచారం, అటు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంలో భాగంగా జిల్లాల టూర్ పై కసరత్తు చేస్తున్నారు .‘‘ విజయ సంకల్ప యాత్ర ’’ పేరుతో వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఈ యాత్ర విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల వరకు ఈ టూర్ కొనసాగేలా ఆయన రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు.