బీజేపీలో టికెట్ల కోలాహలం.. మొదటి రోజు 182 దరఖాస్తులు

బీజేపీలో టికెట్ల కోలాహలం.. మొదటి రోజు 182 దరఖాస్తులు
  • అప్లయ్​ చేసుకున్న కుంజ సత్యవతి, తుల ఉమ, సామ రంగారెడ్డి, ఆకుల శ్రీవాణి
  • ఈ నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ 
  • దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు
  • మూడు పేజీలతో అప్లికేషన్​ ఫారం
  • నేర చరిత్ర ఉంటే చెప్పాల్సిందేనంటూ ప్రత్యేక కాలమ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో ఎమ్మెల్యే టికెట్​ అప్లికేషన్ల సందడి మొదలైంది. పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. తొలిరోజు సోమవారం182 అప్లికేషన్లు వచ్చాయి. 63 మంది నేతలు ఈ దరఖాస్తులను సమర్పించారు. ఒక్కొక్కరు రెండు, మూడు, నాలుగు నియోజకవర్గాల నుంచి అప్లై చేసుకున్నారు. 

మొదటి రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే  కుంజ సత్యవతి, వేములవాడ నుంచి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎల్బీనగర్ నుంచి బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ఉన్నారు. సరూర్ నగర్   కార్పొరేటర్  ఆకుల శ్రీవాణి నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్, సనత్ నగర్ సెగ్మెంట్లు ఉన్నాయి. కాగా, దరఖాస్తుల స్వీకరణ కోసం ముగ్గురితో కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాశ్​ చందర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి మల్లేశం ఉన్నారు..

నేర చరిత్ర ఉంటే చెప్పాల్సిందే!

 టికెట్​ అప్లికేషన్​ మూడు పేజీలతో ఉంది. అప్లై చేసుకునే నాయకుడు తనకు నేర చరిత్ర ఉంటే తెలియజేసేలా అప్లికేషన్​ ఫారంలో ప్రత్యేక కాలమ్​ రూపొందించారు. 
 గతంలో ఏదేని చట్ట సభలకు పోటీ చేశారా.. ఒక వేళ పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి పోటీ చేశారు? ఎన్ని ఓట్లు వచ్చాయి? పార్టీలో ప్రస్తుతం ఏ హోదాలో పని  చేస్తున్నారు..అనే వివరాలను అప్లికేషన్​లో పొందుపరచాల్సి ఉంటుంది.  

అప్లికేషన్ల దరఖాస్తు గడువు ముగిసిన వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించే స్టేట్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ వీటన్నింటిని పరిశీలిస్తుంది. ఆ తర్వాత  ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపిస్తుంది. ఢిల్లీ పెద్దలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల సర్వే నివేదికల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో పేరును ఫైల్ చేస్తారు.  టికెట్​ దరఖాస్తుల స్వీకరణ కోసం బీజేపీ స్టేట్​ ఆఫీసులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.