సర్కారులో సగం బెర్తులు బీజేపీకే!

సర్కారులో సగం బెర్తులు బీజేపీకే!

ముంబై: ఎంమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహాయుతి కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్నది. మొత్తం 43 మంత్రిపదవుల్లో 12 బెర్తులను మాజీ సీఎం ఏక్ నాథ్  షిండే నేతృత్వంలోని శివసేనకు బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, అజిత్  పవార్  నేతృత్వంలోని ఎన్సీపీకి 9 పదవులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. మిగతా మంత్రిపదవులను బీజేపీ తన వద్దే ఉంచుకోనుంది. ముఖ్యమంత్రిపికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాదే తుదినిర్ణయం అని స్పష్టం చేసిన షిండేకు పట్టణాభివృద్ధి, ప్రజాప్రనులు, జలవనరుల శాఖలు కేటాయించే చాన్స్  ఉంది. 

ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు అడ్డుపడబోనని, ఎవరిని ముఖ్యమంత్రిగా ఖరారు చేసినా పూర్తి మద్దతు ఇస్తానని షిండే ఇదివరకే పేర్కొన్నారు. కాగా.. సీఎం పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  ముందున్నారు. నాగ్ పూర్  నైరుతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫడ్నవీస్.. మహాయుతి కూటమి అఖండ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఉద్ధవ్  ఠాక్రే ప్రభుత్వాన్ని ఏక్ నాథ్  షిండే కూల్చి బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకే సీఎం పదవి ఇవ్వాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలతో పాటు ఎన్సీపీ లీడర్లు కూడా అంగీకరించారు. వారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అజిత్  పవార్  తెలిపారు.