
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జల్, జంగల్, జమీన్(నీరు, అడవి, భూమి)ను కాపాడుకునేందుకు ఏకమై పోరాడాలని ప్రజలను కోరారు. సోమవారం (జులై 07) ఆయన రాయ్‌పూర్‌లో నిర్వహించిన 'జై జవాన్– -జై కిసాన్– -జై సంవిధాన్' సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. "రాష్ట్రంలోని సామాన్యులను, ప్రతిపక్షాలను బీజేపీ ప్రభుత్వం భయపెడుతున్నది. ఈడీ, ఐటీ సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు సమయం కేటాయిస్తారు. కానీ, మణిపూర్ ఘర్షణలను మాత్రం పట్టించుకోరు. సోనియా, రాహుల్‌ను కేసుల్లో ఇరికించారు.
అదానీ, అంబానీలు చత్తీస్‌గఢ్‌లో భూములు, అడవులను ఆక్రమిస్తున్నారు. మోదీ, షా వారికి మద్దతిస్తున్నారు. చత్తీస్‌గఢ్ సీఎం వారి ఆదేశాలను పాటిస్తున్నారు. ఇది రాష్ట్ర స్వాభిమానానికి అవమానం" అని ఖర్గే విమర్శించారు.