25న తెలంగాణలో నడ్డా పర్యటన

25న తెలంగాణలో నడ్డా పర్యటన

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 25న తెలంగాణ పర్యటనకు రానున్నా రని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ వెల్లడించారు. నాగర్​కర్నూల్​లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి.. కేసీఆర్ నియంతృత్వ పాలనలో తెలంగాణ వెనకబడ్డ తీరుపై ప్రసంగిస్తారని చెప్పారు. గురువారం ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని తన నివాసంలో చుగ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని మార్చేదిలేదని పార్టీ జాతీయ నాయ కత్వం క్లారిటీ ఇచ్చిందన్నారు. రానున్న అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో నేతలంతా సమిష్టిగా పనిచేస్తారని తెలిపారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని చెప్పారు.

‘రాష్ట్ర నాయకత్వం సమష్టిగానే పనిచేస్తున్నది. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి, ఈటల... మా పార్టీలో అన్నీ సోషల్​ మీడియాలో, ప్రభావం చూపగల నేతలున్నారు’ అని పేర్కొన్నారు. బిపర్​జాయ్ తుఫాన్ కారణంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయిందన్నారు. అయితే, ఇది తాత్కాలిక బ్రేక్ అని.. అతి త్వరలో ఖమ్మంలోనే షా బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు కొనసాగుతున్నాయన్నారు. ప్రజల్లోనూ కేంద్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్నదని, రానున్న రోజుల్లో పార్టీలో బల్క్​లో జాయింనింగ్స్ ఉంటాయని తెలిపారు.

కూటమి పేరుతో ఆటలు

బీఆర్ఎస్​కు కాంగ్రెస్ కొన్ని సందర్భాల్లో బీ టీమ్​గా, కొన్నిసార్లు సీ టీమ్​గా పోటీ పడుతోందని చుగ్ ఎద్దేవా చేశారు. పైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీఆర్ చేతులు కలిపారని విమర్శించారు. అయితే రాష్ట్రంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటో? ఆలోచించుకోవాలని సూచించారు. 
కాంగ్రెస్, నితీశ్ కుమార్, కేసీఆర్ ముగ్గురు కూటమి పేరుతో ఆటలాడుతున్నారన్నారని చుగ్​ఫైర్ అయ్యా రు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరారని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్–కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. అయితే బీజేపీ– బీఆర్ఎస్​ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి విమర్శలన్నీ కల్పితాలని ఆయన కొట్టిపారేశారు.