- బీజేపీ ఓబీసీ మోర్చా
- జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ గ్లోబల్ చరిష్మాను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని రాహుల్.. పార్లమెంటులో వెకిలి చేష్టలు చేస్తూ దేశ పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధి, సంస్కరణలకు అడ్డుపడుతున్న రాహుల్ గాంధీ భారత రాజకీయాలకు ‘రాహు-కేతువు’లా మారారని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ దేశంలో ప్రతి మంచి పనిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గతంలో ఇందిరాగాంధీ విదేశీ నేతలను ఆలింగనం చేసుకుంటే లేని అభ్యంతరం, ఇప్పుడు మోదీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధానిని కౌగిలించుకుని వెకిలిగా కన్నుగీటిన రాహుల్‌కు దౌత్య సంబంధాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి కుట్రపూరితంగా అడ్డుకున్నాయని చెప్పారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 2029 నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 50 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను పెంచుతామని తెలిపారు. ఏఐసీసీ ఇప్పుడు 'యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ'గా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
