కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వర్షంలోనే రోడ్డుపై నిరసన... ఓఆర్​ఆర్​పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వర్షంలోనే రోడ్డుపై నిరసన...  ఓఆర్​ఆర్​పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
  •  శంషాబాద్​ ఓఆర్​ఆర్​కి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు
  • కల్వకుంట్ల కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలి: డీకే అరుణ
  • కేసీఆర్​ పాలనలో పేదల ఆశలు అడియాసలయ్యాయి: కిషన్​రెడ్డి
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన

కల్వకుంట్ల కుటుంబ పాలనలో  రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి విమర్శించారు. ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బాటసింగారం డబుల్​ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్​ గవర్నమెంట్​నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోంది. బాటసింగారానికి వెళ్లేందుకు తమని అనుమతించాలని కిషన్​రెడ్డి పోలీసులను కోరారు. వారు నిరాకరించడంతో వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రఘునందన్​ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్​ నేత డీకే అరుణ తదితరులను హౌస్​ అరెస్ట్​ చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో శంషాబాద్​ఓఆర్ఆర్​దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కిషన్​ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్​రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. కేసీఆర్​ కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని డీకే అరుణ ఎద్దేవా చేశారు. 

ఇళ్ల పంపిణీలో ఆలస్యం ఎందుకు.. 

 కేసీఆర్​ ఉండటానికి 10 ఎకరాల్లో అందమైన భవనం కట్టుకుని పేదలకు ఇళ్ల పంపిణీలో తాత్సారం చేస్తున్నారని కిషన్​రెడ్డి అన్నారు. పూర్తి చేసిన ఇళ్లను పంపిణీ చేయకుండా కేసీఆర్​ కుటుంబం ఆలస్యం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. అయితే బాట సింగారం పోరుబాటకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.