బీఆర్​ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు: లక్ష్మణ్

బీఆర్​ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు: లక్ష్మణ్
  • బీఆర్​ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు: లక్ష్మణ్
  • ఒక్క ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించలేదని ఫైర్
  • మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇచ్చిన వాటిలో ఏ ఒక్క పరీక్ష సరిగ్గా నిర్వహించిన పాపాన పోలేదన్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీస్​ ముట్టడి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన యువ మోర్చా లీడర్లు భాను ప్రకాశ్, శివాజీ, రాజు నేత, పవన్ రెడ్డితో కలిసి ఎంపీ లక్ష్మణ్​ అశోక్​నగర్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అణచివేత, నిర్బంధాలకు బీజేపీ, బీజేవైఎం లొంగే ప్రసక్తే లేదన్నారు. బండి సంజయ్ నేతృత్వంలో పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. లీకేజీపై ప్రశ్నించిన యువ మోర్చా లీడర్లను జైల్లో నిర్బంధించడం అన్యాయమన్నారు. సిట్​తో ఎలాంటి ప్రయోజనం లేదని, సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన ఓయూ, కేయూలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నాయన్నారు. 30లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల అభ్యున్నతిని విస్మరించిన్రు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష మహిళల్లో పెరిగిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు మంగళ అధ్యక్షతన.. తమిళనాడు స్టేట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ సంగీత ముద్వానీ ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గ మహిళా మోర్చా బూత్ కమిటీ సభ్యులతో చిక్కడపల్లిలో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్​కు ఎంపీ లక్ష్మణ్​ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. మహిళల అభ్యున్నతిని విస్మరించిందని తెలిపారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మహిళా మోర్చా లీడర్లు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు పావని, రచన శ్రీ, మహిళా మోర్చా సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.