ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి :  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

వేములవాడ రూరల్, వెలుగు:​ రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్​చేశారు. వేములవాడ రూరల్ మండలంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత యాసంగి సీజన్​లో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా రైతులకు డబ్బులు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. 

రాజన్న ఆలయ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూలైన్లు, వైద్య సేవలతోపాటు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాలని గోపి కోరారు. స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కేటాయించిన నిధులు, ఖర్చులు, వాటి వినియోగంపై పూర్తి వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, కార్యదర్శి సురేందర్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంతోష్ బాబు, జికౌన్సిల్ సభ్యుడు జక్కుల తిరుపతి, అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, సర్పంచ్​లు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.