బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఆ పార్టీ నేతలు బీజేపీలోకి రండి : కిషన్​రెడ్డి

బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఆ పార్టీ నేతలు బీజేపీలోకి రండి : కిషన్​రెడ్డి
  • లోక్​సభ ఎన్నికల్లోపే రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించుకోండి
  • ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్
  • ఏప్రిల్ 14కు వారం అటు, ఇటుగా రాష్ట్రంలో పోలింగ్
  • ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్​కు పిలుపు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఆ పార్టీ నాయకులు లోక్ సభ ఎన్నికల్లోపే తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి, ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇక బీఆర్ఎస్ అవసరం లేదు. కేసీఆర్ కుటుంబ పాలన, వారి అహంకారం, అక్రమాలు, అవినీతితో విసిగిపోయారు. ఆ కుటుంబ కబంధహస్తాల్లో ఉండటం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో కేసీఆర్ పెత్తనం, బీఆర్ఎస్ పాలన అక్కర్లేదని తీర్పు ఇచ్చారు” అని అన్నారు.

సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో హైదరాబాద్ లోక్ సభ క్లస్టర్ సమావేశంలో కిషన్​రెడ్డి పాల్గొని బీజేపీ రథయాత్ర ఏర్పాట్లపై నేతలకు సూచనలు చేశారు. అంతకు ముందు హయత్ నగర్ లో జరిగిన శక్తి వందన్ ప్రోగ్రామ్ లో పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి చివర్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కిషన్​రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14 కు వారం అటు ఇటుగా రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ జరిగే చాన్స్ ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు రెడీ కావాలని పిలుపునిచ్చారు.

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్​’ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యేలా మద్దతు తెలపాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచామని.. ఇప్పుడు డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాల్సిన అవసరముందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటి, అర సీట్లు గెలిచినా.. ఢిల్లీలో వారు చేసేదేమీ లేదన్నారు.

దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై పార్లమెంట్ ఎన్నికల వరకు గిమ్మిక్కులు చేయాలని చూస్తున్నారని చెప్పారు. కర్నాటకలో ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనీ.. వాటిని ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 శాతం మంది ఇప్పటికే బీజేపీకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని.. మరో 30 శాతం మంది ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ చేయడం ఖాయమన్నారు.

పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్యకు బీజేపీ సన్మానం

యక్షగానంలో సమ్మయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ  అందుకోవడం అభినందనీయమని, తెలుగువారికి గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరించిపోతున్న కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పద్మ శ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య (చిందు యాక్షగానం) ను కిషన్ రెడ్డి సన్మానించారు. తర్వాత కిషన్​రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను రక్షించేందుకు ఆ కళలను అనేక తరాల నుంచి కాపాడుతున్న, అసామాన్య ప్రతిభ కనబరుస్తున్న కళాకారులు పద్మశ్రీకి ఎంపిక కావడం ప్రధాని చలవే అన్నారు.