టీఆర్ఎస్​ నేతలపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్​

 టీఆర్ఎస్​ నేతలపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గొప్ప విజయం సాధించినట్లు టీఆర్ఎస్ నాయకులు విర్రవీగుతున్నారని.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, స్కీంలు ఆపేస్తామని బెదిరించి గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు అబద్ధాలను ప్రచారం చేసి, ఓటర్లను నమ్మించి గెలవడంలో సక్సెస్ అయ్యారని విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన పార్టీ నేతలు బూర నర్సయ్య, ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అక్కడే మోహరించినా.. కేవలం నాలుగున్నర శాతం ఓట్లతోనే గెలిచారన్నారు. కనీసం ఈ గెలుపుతోనైనా మునుగోడు అభివృద్ధికి సీఎం కేసీఆర్  పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలన్నారు. లెంకలపల్లిలో దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తామని ఊరించారని, ఆ స్కీంను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. బీజేపీ వాళ్లను కొనడం అంత ఈజీ కాదన్నారు. 

టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం : బూర

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని తేలిపోయిందని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనను దించేసి ప్రజాస్వామ్య పాలనను అందించేది బీజేపీ మాత్రమేనన్నారు. సంక్షేమ పథకాలకు నిధులను మహిళల కన్నీళ్లు, మద్యం అమ్మకాలు చెల్లిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర సంక్షేమానికి స్ఫూర్తిదాత రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైడ్ బ్రాండ్ లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసమే.. ఇక నుంచి మీ వెంట పడుతం.. కేటీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం ఊరూరా చాటింపు  వేయించి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు డిపాజిట్లు రాకుండా చేస్తం, తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల తరఫున పోరాడుతం..మేం ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు.. మా సినిమా 2023 లో చూపిస్తం.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే..’ అని అన్నారు. చర్లగూడెంలో కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ నేతలను తిట్టని వారు లేరని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ముంపునకు గురైన ప్రజలను బెదిరింపులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. వారికి అండగా ఉండి  పోరాటం చేస్తామని హెచ్చరించారు.