
- ఆరుగురు కాంగ్రెస్ మంత్రులు మాతో టచ్‌లో ఉన్నరు
- బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి హెచ్చరిక
- సీఎం కుర్చీ మీద పది మంది కన్నేశారని ఆరోపణ
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: తమ పార్టీ ఎమ్మెల్యేల జోలికొస్తే 48 గంటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ సర్కారును కూల్చేందుకు కాంగ్రెస్ మంత్రులే సిద్ధంగా ఉన్నారని అన్నారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కోమటి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయినా.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో అభద్రతా భావంతో రేవంత్ ప్రభుత్వం నడుస్తున్నదని అన్నారు. రేవంత్ కుర్చీ మీద 10 మంది కన్నేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వారు నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఎటువైపు ఉన్నాడో ముందు తేల్చుకోవాలని వెంకట్‌రెడ్డికి చురకలంటించారు. రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణ చేయిస్తామని చెప్పి మాట మరిచారని అన్నారు. కాంగ్రెస్ వసూలు చేస్తున్న చిట్టా తమ దగ్గర ఉన్నదని తెలిపారు. అందుకే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. దాదాపు ఐదుగురు ఎంపీ అభ్యర్థులు, ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక హక్కు వెంకట్ రెడ్డికి లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడ చేసిన వసూళ్లను ఢిల్లీకి పంపించే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. గడ్కరీ వద్దకు వెళ్లి తాను షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్‌లో ఎవరికీ నమ్మకం లేదని అన్నారు. భువనగిరి టికెట్‌ను రాజ్ గోపాల్ రెడ్డి భార్యకు రాకుండా చేసింది వెంకట్ రెడ్డేనని ఆరోపించారు.