- అమెరికా ఒత్తిళ్లతో రష్యా ఆయిల్ కొనుగోళ్లలో తగ్గుదల
- క్రూడ్ ప్రొడక్షన్ పెంచనున్న ఒపెక్ ప్లస్
- ఆయిల్ మార్కెట్‌ను స్టేబుల్‌గా ఉంచేందుకే
న్యూఢిల్లీ: అమెరికా ఒత్తిళ్లతో రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకుంటున్న ఇండియా, మళ్లీ ఈ దేశం నుంచి దిగుమతులు పెంచాలని ప్లాన్ చేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలతో ఆయిల్ సప్లయ్‌లో అంతరాయం ఏర్పడుతుందని భారత రిఫైనరీలు భావిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి మూతపడితే ఇండియా నెలవారీ చమురు దిగుమతుల్లో సగం వరకు, అలాగే దాదాపు మొత్తం ఎల్‌పీజీ సరఫరాలు ప్రభావితమవుతాయి. దీంతో ఇతర దేశాల నుంచి ఆయిల్ సప్లయ్‌ను పెంచుకోవాలని ఇండియా చూస్తోంది. ప్రస్తుతం భారత్ 2.5–2.7 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే (బీపీడీ) క్రూడ్‌ను హోర్ముజ్ ద్వారా దిగుమతి చేసుకుంటోంది. ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి ఈ సరఫరా జరుగుతోంది.
కిందటేడాది అమెరికా రష్యన్ కంపెనీలు రోస్నెఫ్ట్, లూకోయిల్‌పై ఆంక్షలు విధించడంతో భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించి, గల్ఫ్ దేశాల నుంచి సప్లయ్ పెంచింది. దీంతో హోర్ముజ్‌లో రవాణాకు అంతరాయం ఏర్పడితే మనకు వచ్చే ఆయిల్ సప్లయ్‌లో అంతరాయం ఏర్పడుతుంది. అదే జరిగితే దిగుమతులు ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి.
మరోవైపు రష్యన్ కార్గోలు ఇంకా ఇండియన్ ఓసియన్, అరేబియా సముద్రంలో అందుబాటులో ఉన్నాయని రీసెర్చ్ కంపెనీ కెప్లర్ పేర్కొంది. అవసరమైతే భారత రిఫైనరీలు మళ్లీ రష్యన్ చమురుకు మళ్లొచ్చని తెలిపింది. కాగా, గల్ఫ్ చమురు ఇండియాకు కేవలం 5–7 రోజుల్లో చేరుతుంది. కానీ అట్లాంటిక్ నుంచి వస్తే 25–45 రోజులు పడుతుంది. గల్ఫ్ కంటే రష్యన్ ఆయిల్ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.
రష్యన్ నుంచి 1.15 మిలియన్ బీపీడీ..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి 1.15 మిలియన్ బీపీడీని ఇండియా దిగుమతి చేసుకోగా, ఇరాక్ నుంచి 0.942 మిలియన్ బీపీడీ, సౌదీ నుంచి 1.11 మిలియన్ బీపీడీ వచ్చాయి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) అవసరాల్లో 80–85శాతం గల్ఫ్ నుంచి వస్తోంది. హోర్ముజ్ జల సంధి ద్వారా సరఫరా జరుగుతోంది. క్రూడ్‌కు స్ట్రాటజిక్ నిల్వలు ఉన్నా, ఎల్‌పీజీకి అలాంటి నిల్వలు లేవు. దీంతో దీని ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2025–26లో ఏప్రిల్–జనవరి మధ్య భారతదేశం 1.88 కోట్ల టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకుంది.
అదనంగా రోజుకు 2 లక్షల బ్యారెల్స్ ఉత్పతి
సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలతో కూడి ఒపెక్ ప్లస్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చమురు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించాయి. రోజుకు 2,06,000 బ్యారెల్స్ అదనంగా ఉత్పత్తి చేయనున్నాయి.
కిందటేడాది అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్‌లో ఒపెక్ ప్లస్ అదనంగా రోజుకి 1,37,000 బ్యారెల్స్ ఉత్పత్తి పెంచగా, తాజాగా దీనిని దాదాపు 70 శాతం పెంచాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఆయిల్ మార్కెట్‌ను స్టేబుల్‌గా ఉంచేందుకు ప్రొడక్షన్ పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయించింది.
గత వారం లండన్ మార్కెట్లో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 73 డాలర్లకి చేరాయి. ఇది ఏడాది లోపు గరిష్ట స్థాయి. సౌదీ, యూఏఈలు కలిపి రోజుకు 2.5 మిలియన్ బ్యారెల్స్ వరకు అదనపు సామర్థ్యం కలిగి ఉన్నాయి. అమెరికా, కజాఖ్‌స్తాన్ వంటి దేశాల్లో ఉత్పత్తి అంతరాయాలు, రష్యా–ఇరాన్‌పై ఆంక్షలు, స్ట్రాటజిక్ నిల్వల కోసం చైనా అధిక కొనుగోళ్లు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను గందరగోళంలోకి నెట్టాయి. సౌదీ అరేబియా గత సంవత్సరం కూడా ఉత్పత్తి పెంచి మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నించింది. ఈసారి కూడా అదే వ్యూహం కొనసాగిస్తుందని అంచనా.
