పదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్‌‌ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్

పదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్‌‌ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తీరు 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా తయారైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.  ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేసే దమ్ము, ధైర్యంలేక బీజేపీని, ప్రధాని మోదీని తిట్టడమే పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాకముందు బట్లర్‌‌లా హామీలిచ్చిన నాయకులు, ఇప్పుడు ప్రజలపై హిట్లర్ తరహా పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనను తాను హిట్లర్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించుకోవడం అత్యంత బాధాకరమన్నారు. కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న నియంతను ఒక ముఖ్యమంత్రి స్ఫూర్తిగా చెప్పుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అహంకార రాజకీయాలను సహించరని, కాంగ్రెస్‌‌కు త్వరలోనే గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  

గతంలో జీఎస్టీ వసూళ్లలో దేశంలో ఏడో స్థానంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు తొమ్మిదో స్థానానికి ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేయాలన్నా కేంద్రమే నిధులిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూసేకరణ కూడా చేయలేకపోతోందని బూర విమర్శించారు.