మన దేశ వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేస్కోవాలంటరా?

మన దేశ వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేస్కోవాలంటరా?

రాహుల్ గాంధీపై వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ : ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అమెరికా, యూరప్ దేశాలు జోక్యం చేసుకోవాలంటూ లండన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై బీజేపీ ఫైర్ అయింది. లండన్​లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో రాహుల్ భారతదేశ ప్రజాస్వామ్యం, పార్లమెంట్, పొలిటికల్ సిస్టం, న్యాయవ్యవస్థలను అవమానించారని, సరిహద్దు భద్రత అంశంపైనా దేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు మాట్లాడారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాలను కాపాడే అమెరికా, యూరప్ దేశాలు ఇండియాలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం నశిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?” అంటూ విదేశీ గడ్డపై రాహుల్ కామెంట్ చేయడం ఏమిటని విమర్శించారు. రాహుల్ కామెంట్లపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ సోనియా గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘మన దేశ వ్యవహారాలలో అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని రాహుల్ భావిస్తున్నారా? మన అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు ఎలా జోక్యం చేసుకుంటాయి.. అలా చేసుకోవాలని కోరుకోవడమేంటి’ అని ప్రశ్నించారు.  

మావోయిస్ట్​లా రాహుల్ తీరు  

రాహుల్ ఆలోచనా విధానం మావోయిస్ట్ సిద్ధాంతాలను పోలి ఉందన్నారు. బ్రిటన్ పార్లమెంట్ వేదికగా రాహుల్ దేశాన్ని అవమానించేలా అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. భారత దేశ ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్​కు సపోర్ట్ చేయనంత మాత్రాన విదేశీ గడ్డకు వెళ్లి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలకు మైక్ ఇవ్వడంలేదంటూ బ్రిటన్ పార్లమెంటేరియన్లతో భేటీలో కామెంట్ చేయడం సిగ్గుచేటన్నారు. రాహుల్​కు ఇండియన్ పార్లమెంటరీ నిబంధనలు తెలియవన్నారు. దేశానికి, సమాజానికి సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్​ను ఫాసిస్ట్ సంస్థ అంటూ విమర్శించడాన్ని రవిశంకర్ ఖండించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశమంతా విస్తరిస్తోందని, కాంగ్రెస్ మాత్రం మరింత కుంచించుకుపోతుందన్నారు.