టీచర్లకు ప్రభుత్వ సాయం ఏ మూలకు సరిపోతుంది?

టీచర్లకు ప్రభుత్వ సాయం ఏ మూలకు సరిపోతుంది?

ప్రైవేట్ టీచర్ల కోసం ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల ఆర్థికసాయం ఏ మూలకు సరిపోతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సెకండ్ వేవ్ కరోనాతో రాష్ట్రంలోని స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో టీచర్ల పరిస్థితి ఆగమాగమైంది. రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాగార్జునసాగర్‌కు చెందిన ప్రైవేట్ టీచర్ రవి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దాంతో ప్రైవేట్ టీచర్లకు ప్రతినెలా రూ. 2 వేల ఆర్థికసాయంతో పాటు.. 25 కేజీల బియ్యం అందించాలని సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోదని విజయశాంతి అన్నారు.

‘తెలంగాణలో గత ఆరేడు నెలలుగా ప్రయివేటు టీచర్ల జీవితం దారుణంగా దిగజారిపోయింది. వరుస ఆత్మహత్యలు, పాలకుల పట్టింపులేనితనంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో తూతూ మంత్రంగా రాష్ట్ర సర్కారు వారికి రూ.2 వేలు డబ్బు, 25 కిలోల బియ్యం సాయంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల వల్ల కిందటేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 30 మంది ప్రయివేటు టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరెందరో ఉద్యోగాలు కోల్పోయి నేటికీ బండ్లు నడుపుకుంటూ, కూరలమ్ముకుంటూ, కూలీలుగా ఇలా బతుకు గడవడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల మార్గాలు వెదుక్కుంటున్నారు. ఈ పరిస్థితులపై మీడియాలో మొదటి నుంచీ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే సర్కారు మేల్కొని వారికి అండగా పాలకులు ఉన్నారనే భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరిచ్చే 2 వేలు ఆ కుటుంబాలకు ఏమూలకు సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ టీచర్లయినా, ప్రయివేటు టీచర్లయినా.. సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేనని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. కేవలం కాస్త డబ్బు, బియ్యం ఇస్తే వారి కన్నీరు ఆగదు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి. సర్కారు ఈ దిశగా ప్రయత్నించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.