కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ
  • ప్రజల ముందు ఈ పార్టీలనాటకాలు: కిషన్ రెడ్డి
  • నియంతృత్వ పాలన నుంచి విముక్తి కల్పిస్తాం: చుగ్ 
  • బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి, ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు:కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా బీఆర్ఎస్ వ్యవహరించింది. ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం సంతకాలు చేశాయి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. అన్నీ గమనిస్తున్నారు” అని అన్నారు. 

ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందైనా, తర్వాతైనా కలిసి నడవడం ఖాయమన్నారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్(మల్కాజిగిరి), జైపాల్ రెడ్డి(జహీరాబాద్), లక్ష్మారెడ్డి (రంగారెడ్డి) బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, డీకే అరుణ, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్​ జవదేకర్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్, సీనియర్ లీడర్ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల చేరికతో బీజేపీ మరింత బలోపేతం అయిందన్నారు. 

బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్​ఎస్​తో కలిసే ప్రసక్తేలేదన్నారు. అవినీతి, అహంకార, వారసత్వ పాలన నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని నమ్మినందునే పలు పార్టీల నేతలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు బీజేపీతో నడవాలని కోరారు. 

బీజేపీ గెలిచి తీరుతది.. 

కాంగ్రెస్ నేతల జాయినింగ్ ఆరంభం మాత్రమే అని తరుణ్ చుగ్ అన్నారు. గత మూడేండ్లలో పెద్ద పెద్ద నేతలు బీజేపీలో చేరారన్నారు. ఈ చేరికలు పార్టీకి మరింత బలం చేకూర్చుతుందన్నారు. ప్రధాని మోదీ పాలన, కేంద్రం అమలు చేస్తోన్న స్కీంలు నచ్చి వీరంతా బీజేపీలో జాయిన్ అయ్యారన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరి నమ్మకద్రోహానికి  పాల్పడ్డారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సర్కారు రాబోతోందని చెప్పారు.   

డూప్లికేట్ నేతలే కాంగ్రెస్ లో ఉన్నరు: రంగారెడ్డి  

ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చారని.. మిక్స్​డ్ పార్టీలు, డూప్లికేట్లు, అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు మాత్రమే కాంగ్రెస్​లో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీని 50 సార్లు కలిసినా తనను గుర్తుపట్టలేరన్నారు. రాజకీయ చైతన్యం లేని అలాంటి నేత నాయకత్వంలో పని చేయలేమన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్తలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ వంటి వారికీ కీలక పదవులతో గౌరవం దక్కిందన్నారు.

ఇయ్యాల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటన

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో వరద బాధితులను పరామర్శిస్తారు. సహాయక చర్యలను పరిశీలిస్తారు. వరంగల్ లోని రంగంపేట, భద్రకాళి టెంపుల్​, కొలంబో మెడికల్ కాలేజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యపై ర్యాలీ, ధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.