వరద నీటిలో బీజేపీ నేతల నిరసన

వరద నీటిలో బీజేపీ నేతల నిరసన

మేడిపల్లి: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో ఇండ్లలోకి వరద చేరినా మేయర్, పాలక వర్గం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ పరిధిలో నీట మునిగిన విష్ణుపురి కాలనీని బీజేపీ మేడ్చల్ అధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వరద నీటిలో నిల్చుని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీర్జాదిగూడ నంబర్ వన్ కార్పొరేషన్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే అధికార పార్టీకి చెందిన మేయర్, కార్పొరేటర్లు వానలకు కాలనీల్లో నీళ్లు చేరుతుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ముంపు ప్రాంతాల్లో పర్యటించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేయడం వల్లే ముంపు సమస్య వస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ముంపు సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో బీజేపీ పీర్జాదిగూడ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు పవన్, నేతలు పాల్గొన్నారు.