
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ నేత సురేంద్ర మటియాలాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఢిల్లీ ద్వారకలోని తన ఆఫీసులో శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కాల్చి చంపారు. సురేంద్ర మటియాలా, అతడి అల్లుడు కలిసి టీవీ చూస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని లోనికి వచ్చారు.
తొలుత సురేంద్రను తీవ్రంగా కొట్టారు. తర్వాత అతి దగ్గరి నుంచి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపారు. ‘‘ఈ దాడిలో మొత్తం ముగ్గురు పాల్గొన్నారు. ఇద్దరు ఆఫీసులోకి రాగా, మరో వ్యక్తి బైక్‌పై ఆఫీసు బయట ఉన్నాడు. హత్య చేసిన తర్వాత ముగ్గురూ బైక్‌పై పరారయ్యారు” అని పోలీసులు చెప్పారు. కాగా, తన తండ్రికి శత్రువులంటూ ఎవరూ లేరని సురేంద్ర కొడుకు తెలిపాడు. దీంతో ఎవరైనా వ్యక్తిగత ప్రతీకారంతోనే దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ప్రాపర్టీ విషయంలో కొందరితో సురేంద్రకు వివాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ద్వారక డిప్యూటీ కమిషనర్ హర్షవర్ధన్ వెల్లడించారు.