టీఆర్ఎస్​ సంకలు గుద్దుకుంటోంది

 టీఆర్ఎస్​ సంకలు గుద్దుకుంటోంది

యాదాద్రి, వెలుగు: ‘‘ఆరుకు ఆరు మాకే వచ్చాయని టీఆర్ఎస్​ సంకలు గుద్దుకుంటోంది. మీ పార్టీపై గెలిచినోళ్లను కాపాడుకునేందుకు గోవా, ఢిల్లీలో క్యాంపులకు తీసుకెళ్లి.. మీరే డబ్బులిచ్చి.. దేవుడి మీద ప్రమాణం చేయించి.. ఓట్లు వేయించుకొని గెలిచి దానికే.. సంకలు గుద్దుకోవడం ఏమిటి” అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్​ మెంబర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ ఆత్మాభిమానంతో బీజేపీ, కాంగ్రెస్​ పరోక్షంగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయని చెప్పారు.

తెలంగాణ ప్రజలు నరేంద్రమోడీ పాలనకు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యంగా జీన్స్​ప్యాంట్​ వేసుకున్న కొత్త ఓటర్లు బీజేపీవైపే చూస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఆకాంక్ష మేరకే ప్రధాని నరేంద్రమోడీ డీమానిటైజేషన్​ చేశారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్​ అంబేద్కర్​.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ప్రతి పదేళ్లకు ఒకసారి డీమానిటైజేషన్​ జరగాలని సూచించారని వెల్లడించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 2023 ఎన్నికల్లో కార్యకర్తల బలంతోనే అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. ఈ శిక్షణా తరగతుల్లో  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్​కుమార్, వెంకట రమణ, కేవీఎల్ఎన్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి తదితరులు మాట్లాడారు.