సింగరేణి కార్మికుల ద్రోహి బీఆర్ఎస్: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి కార్మికుల ద్రోహి బీఆర్ఎస్: గడ్డం వంశీకృష్ణ

 

  • కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నది
  • ఎంపీగా గెలిపిస్తే కార్మికుల హక్కుల కోసం పోరాడుతా 
  • అహంకారం వర్సెస్ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తానని వెల్లడి

కోల్ బెల్ట్, వెలుగు:  బీఆర్ఎస్ పార్టీ.. సింగరేణి కార్మికుల ద్రోహి అని పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తున్నదని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ధ్వజమెత్తారు. శనివారం మంచిర్యాల జిల్లా హైటెక్ ​సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో మీడియాతో వంశీ మాట్లాడారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పొందడం కార్మికుల వారసుల హక్కు అని, ఉద్యోగాలు ఇప్పించేందుకు వారి నుంచి బీఆర్ఎస్ లీడర్లు రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి, మోసం చేశారన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదన్నారు. అహంకారం వర్సెస్ అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నానని, తనను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల హక్కుల రక్షణకు పాటుపడతానని చెప్పారు. 

కాంగ్రెస్ మాటిస్తే తప్పదు: వివేక్ వెంకటస్వామి 

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతుందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కొప్పుల ఈశ్వర్.. సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. సింగరేణిలో కార్మికుల ఉద్యోగాలను తీసివేసినప్పుడు మంత్రిగా ఉన్న ఈశ్వర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని 
ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ కార్మికులకు చేసిందేమీ లేదన్నారు.    

పెద్దపల్లిలో వంశీ గెలుపు ఖాయం..

రాష్ట్రంలో నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని వివేక్‌ వెంకటస్వామి అన్నారు. నేతకాని కులసంఘ భవనాల నిర్మాణానికి తాను కృషి చేస్తానని చెప్పారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. వంశీకి మద్దతుగా అన్ని చోట్ల మంచి స్పందన వస్తుందని తెలిపారు. కాగా, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు సీపీఎం, మాల ప్రజా సంఘాలు, మాల మహానాడు జేఏసీ లీడర్లు, రాష్ట్ర నేతకాని సామాజిక సేవా సంఘం లీడర్లు మద్దతు పలికారు. ప్రెస్‌ మీట్‌లో మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపుజు రమేశ్, నేతకాని సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దుర్గం నరేశ్, రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి రవి, ప్రకాశ్ పాల్గొన్నారు.