Shah Rukh Khan : రజనీకాంత్ 'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్?.. మిథున్ చక్రవర్తి లీక్‍తో ఫ్యాన్స్ ఖుషీ!

Shah Rukh Khan : రజనీకాంత్ 'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్?.. మిథున్ చక్రవర్తి లీక్‍తో ఫ్యాన్స్ ఖుషీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'జైలర్ 2' రెడీ అవుతోంది. అయితే ఈమూవీ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా గురించి మేకర్స్ కంటే ముందే బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రేజీ సీక్వెల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (SRK) కూడా భాగం కాబోతున్నారనే లీక్ ఇచ్చారు. ఇప్పుడు ఈలీక్ దేశవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

'జైలర్ 2' లో షారుఖ్ ఖాన్?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ 'జైలర్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "జైలర్ 2 కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ వంటి భారీ తారాగణం ఉండబోతోంది అని ఆయన తెలిపారు.

వాస్తవానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే మిథున్ లాంటి సీనియర్ నటుడు స్వయంగా ఆయన పేరు ప్రస్తావించడంతో, ఇది కేవలం అతిథి పాత్రనా లేక ఫుల్ లెంగ్త్ రోలా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ రజనీ, షారుఖ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

శివరాజ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.. ఈ సినిమా మొదటి భాగంలో ఆయన పోషించిన 'నరసింహ' పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే సెకండ్ పార్ట్‌లో తన పాత్ర నిడివి మరింత ఎక్కువగా ఉంటుందని, కథలో చాలా కీలకమైన మలుపులకు తన క్యారెక్టర్ కారణమవుతుందని ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

►ALSO READ | CHAMPION Review: `ఛాంపియన్` రివ్యూ.. 1948 బైరాన్ పల్లి కథతో రోషన్ హిట్ కొట్టాడా?

భారీ తారాగణం
ఈ మూవీలో ముత్తువేల్ పాండియన్  భార్యగా రమ్యకృష్ణ అలరించనుంది. వినాయకన్ విలన్‌గా ఈ సీక్వెల్‌లోనూ కనిపించబోతున్నారు. వీరితో పాటు SJ సూర్య ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారు. మేఘనా రాజ్ సర్జా దాదాపు 13 ఏళ్ల తర్వాత తమిళ తెరపైకి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. సంతానం, యోగి బాబు, అన్నా రాజన్, సూరజ్ వెంజారాముడు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 'హుకుం' వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ తర్వాత అనిరుధ్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వండర్ మూవీని జూన్ 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.