ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. అయితే ఈ రెండింటినీ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ చేసింది. 2025 డిసెంబర్ 31 లోపు పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డ్ డీయాక్టివేట్ చేయబడనుంది.
పాన్ కార్డ్ గడువులోగా లింక్ చేయకపోతే మీ ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు పొందడం కూడా సాధ్యం కాదు. అంతేకాక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, కేవైసీ ఆధారిత లావాదేవీలలో అంతరాయం కలుగుతుంది. లింక్ చేయని వారిపై ఎక్కువ TDS లేదా TCS విధించే అవకాశం కూడా ఉంది.
లింకింగ్ స్టేటస్ చెక్కింగ్..
మీ పాన్ ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు:
1. మొదట www.incometax.gov.in పోర్టల్‌కి లాకిన్ కావాలి.
2. 'Quick Links' విభాగంలో 'Link Aadhaar Status' పై క్లిక్ చేయండి.
3. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
4. 'View Link Aadhaar Status' బటన్ నొక్కండి. అక్కడ మీకు 'Linked' అని కనిపిస్తే మీ పని పూర్తయినట్లే. ఒకవేళ 'Not Linked' అని ఉంటే వెంటనే లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
లింక్ చేయడం ఎలా?
వెబ్‌సైట్‌లోని 'Link Aadhaar' ఆప్షన్ ద్వారా మీ వివరాలను నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ గతంలోనే పేమెంట్ చేసి ఉంటే.. 4-5 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఒక పాన్ మరొక ఆధార్‌తో పొరపాటున లింక్ అయ్యి ఉంటే.. సంబంధిత అధికారులను కలిసి సరిచేసుకోవాలి. దీన్ని పూర్తి చేసేందుకు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసి వెంటనే పూర్తి చేసుకోండి.
