ఢిల్లీ ఈవీ పాలసీ 2.0: ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనే మహిళలకు రూ.30వేలు సబ్సిడీ..!

ఢిల్లీ ఈవీ పాలసీ 2.0: ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనే మహిళలకు రూ.30వేలు సబ్సిడీ..!

కాలుష్య రహిత నగరంగా మారే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. పాత ఈవీ పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరింత ఆకర్షణీయమైన ప్రయోజనాలతో ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ను సిద్ధం చేస్తోంది. 2026 మొదటి త్రైమాసికంలో అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు భారీగా లబ్ధి చేకూరనుంది.

ఈ కొత్త పాలసీలో ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై దృష్టి సారించారు. సాధారణ కొనుగోలుదారులకు ఒక్కో వాహనంపై రూ.21వేలు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించగా.. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు మహిళా కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.30వేల వరకు సబ్సిడీ అందించనున్నారు. లక్ష వాహనాల వరకు ఈ ప్రయోజనం వర్తించే అవకాశం ఉంది. అలాగే నగరంలో ఈవీ టూవీలర్ల సంఖ్యను 5 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ఢిల్లీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

పెట్రోల్, డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే వారికి దేశంలోనే తొలిసారిగా రూ.50వేలు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. అయితే ఇది మొదటి వెయ్యి కార్లకు మాత్రమే పరిమితం. ఇక ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్ల విషయానికొస్తే.. రూ.25 లక్షల లోపు ధర ఉన్న వాహనాలకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి గరిష్టంగా రూ.లక్ష వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. అదనంగా ఈవీ లోన్స్ పై 5% వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం భరించనుంది.

►ALSO READ | Silver Rate Prediction: 2026లో వెండి రేటు కేజీ రూ.6 లక్షలు దాటేస్తుంది.. రాబర్ట్ కియోసాకి సంచలన అంచనా..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో.. ఈవీ విడిభాగాలను స్థానికంగా తయారు చేసే కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనుంది ఢిల్లీ ప్రభుత్వం. అంతేకాకుండా  బ్యాటరీ టెక్నాలజీ, ఛార్జింగ్ సొల్యూషన్స్‌లో ఆవిష్కరణల కోసం పరిశోధన నిధినిప్రస్తుతమున్న రూ.5 కోట్ల నుంచి ఏకంగా రూ.100 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.

మొత్తానికి పాత వాహనాల స్క్రాపింగ్ నుంచి కొత్త వాహనాల కొనుగోలు వరకు అన్ని దశల్లోనూ రాయితీలు కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందిస్తోంది. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం సామాన్యులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.