Silver Rate Prediction: 2026లో వెండి రేటు కేజీ రూ.6 లక్షలు దాటేస్తుంది.. రాబర్ట్ కియోసాకి సంచలన అంచనా..

Silver Rate Prediction: 2026లో వెండి రేటు కేజీ రూ.6 లక్షలు దాటేస్తుంది.. రాబర్ట్ కియోసాకి సంచలన అంచనా..

డిసెంబర్ 2025 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి. కేవలం ఒకే ఏడాదిలో వెండి 140% పైగా లాభాలను అందించి ఇన్వెస్టర్ల పాలిట కల్పవల్లిగా మారింది. ఔన్స్ వెండి ధర(ఒక ఔన్స్ = 28.3495 గ్రాములు) ప్రస్తుతం72 డాలర్ల మార్కును దాటగా, భారతీయ మార్కెట్‌లో ఇది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంటే గ్రాము ధర రూ.228 కంటే ఎక్కువగానే ఉంది భారత కరెన్సీ లెక్కల ప్రకారం.

అయితే ప్రముఖ రచయిత, పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి 2026లో వెండి ధరలపై సంచలన అంచనాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా వెండి రేటు వచ్చే ఏడాదిలో ఔన్సుకు 200 డాలర్ల వరకు పెరుగుతుందని అన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రేటు దాదాపు మూడింతలుగా మారుతుందని ఆయన అంటున్నారు. ఇదే జరిగితే సిల్వర్ రేటు గ్రాముకు రూ.635 అవుతుంది. అంటే కేజీ వెండి ధర దాదాపు రూ.6లక్షల 35వేల స్థాయికి చేరుతుందని కియోసాకి చెబుతున్నారు. అయితే ఈ భారీ అంచనాలకు వెనుక రూపాయి పతనం కూడా కారణమే. 

పెరుగుదలకు ప్రధాన కారణాలు:
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణం. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం వెండిని 'అరుదైన ఖనిజాల' జాబితాలో చేర్చడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండిని ఎంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు ఊతమిస్తున్నాయని తేలింది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే నెలల్లో వెండి ధరలు ఔన్స్‌కు 80 నుండి 100 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే భారతీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 2.50 లక్షల నుండి రూ. 3.15 లక్షల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, రాబోయే రెండు ఏళ్లు చాలా కీలకం కానున్నాయి. 

మెుత్తానికి ప్రభుత్వాలు ముద్రించే కరెన్సీ నోట్లను దాచుకునే వారు నష్టపోతారని.. వెండి-బంగారం కొని దాచుకునేవారు లాభపడతారని రాబర్ట్ కియోసాకి ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. మరోపక్క యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా కూడా వెండిలో మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. భౌతికంగానే కాకుండా డిజిటల్, ఈటీఎఫ్స్ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించొచ్చు. 

(ఇక్కడ డాలర్ మారకపు విలువ 90 రూపాయలుగా లెక్కించబడింది.)