- రూ.6.5 కోట్లు విడుదలకు పాలనా అనుమతి
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కేంద్ర యువజన, క్రీడల శాఖల మంత్రిత్వశాఖ జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ అభివృద్ధికి రూ.6.50 కోట్ల మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో అనుమతిస్తూ శాఖ అండర్ సెక్రటరీ చంచల్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ అందిన 15 రోజుల్లోగా కేంద్రానికి ఆమోదం తెలపాల్సి ఉంది. జమ్మికుంటలో స్టేడియాన్ని నిర్మిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రకటించారు.
కాగా జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్రం పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వడంపట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సింథటిక్ ట్రాక్ ను నిర్మించి సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
