డబ్బు సంపాదించడం అనేది కొందరికి విలాసం, మరికొందరికి లైఫ్ టార్గెయ్. కానీ గోవాకు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంకోలియంకర్ దృష్టిలో అది ఒక 'ట్రామా రెస్పాన్స్'. తన తండ్రికి క్యాన్సర్ సోకిన సమయంలో తన ఫ్యామిలీ పడిన ఆర్థిక ఇబ్బందులే తనను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చిందని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజ్ తండ్రి పనాజీలో ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు. 2004లో రాజ్ 11 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు.. వారి కుటుంబం అప్పుడే ఒక హోమ్ లోన్ తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో ఆయన తండ్రికి 'స్టేజ్-3 లింఫోమా' క్యాన్సర్ బారిన పడినట్లు తేలింది. గోవాలో సరైన చికిత్స లేక.. ఇన్సూరెన్స్ అందక.. అతని తండ్రి విషం లాంటి కీమోథెరపీ మందులను శరీరంలోకి ఎక్కించుకుని ముంబై నుంచి గోవాకు 8 గంటల పాటు బస్సులో ప్రయాణించేవారు. అంత బాధలోనూ మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ కిరాణా కొట్టు తెరిచేవారు. అప్పులు, బంధువుల సాయంతో ఆ కుటుంబం గడిపిన ఆ రోజులు రాజ్ మనసులో చెరగని ముద్ర వేశాయి.
చికిత్స వల్ల క్యాన్సర్ తగ్గుముఖం పట్టినా.. ఆ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఆ కుటుంబానికి 11 ఏళ్లు కష్టపడింది. విదేశాల్లో చదువుకోవాలన్న రాజ్ కలలను కూడా ఆర్థిక పరిస్థితులు అడ్డుకున్నాయి. మళ్లీ క్యాన్సర్ వస్తే పరిస్థితి ఏంటి? అన్న తల్లి భయం అతడిని ఇండియాలోనే ఉండి బిట్స్ పిలానీలో చదువుకునేలా చేసింది. 2022లో క్యాన్సర్ మరింత తీవ్రంగా తిరగబెట్టింది. కానీ ఈసారి రాజ్ దగ్గర డబ్బు ఉంది. తండ్రికి బెస్ట్ ట్రీట్మెంట్, విమాన ప్రయాణాలు, ఖరీదైన ఆసుపత్రులు.. అన్నీ అందించగలిగాడు. 2023లో ఆయన తండ్రి చనిపోయినప్పటికీ చేయగలిగినదంతా చేశాననే సంతృప్తి రాజ్ కి మిగిలింది.
తాను డబ్బు గురించి, ఇన్సూరెన్స్ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతానో చాలా మందికి తెలియదని, అది అత్యాశ కాదు గతం నేర్పిన పాఠం అంటున్నారు రాజ్. ఆప్షన్స్ లేని సమయంలో డబ్బు మాత్రమే మనకు అవకాశాలను ఇస్తుందని అన్నారు. తన తండ్రి పడిన కష్టం మరే తండ్రి పడకూడదనే ఉద్దేశంతోనే ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. "ఇన్సూరెన్స్ తీసుకోండి.. మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారితో సమయం గడపండి" అని రాజ్ ఇచ్చే సలహా నెటిజన్ల మనసు గెలుచుకుంది.
