ఎన్నికల షెడ్యూల్​కు ఒకరోజు ముందే .. ఎందుకు అరెస్ట్​ చేశారు?

ఎన్నికల షెడ్యూల్​కు ఒకరోజు ముందే .. ఎందుకు అరెస్ట్​ చేశారు?
  • ఈడీ కేసులో 4 పేజీలతో రీ జాయిండర్ దాఖలు చేసిన కవిత  

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందే తనను ఎందుకు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రీ- జాయిండర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వ్యవహారంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాల  ప్రకారం.. ఆమె న్యాయవాది మోహిత్ రావు శనివారం సంక్షిప్తంగా(బ్రీఫ్) 4 పేజీల రీ – జాయిండర్ ను దాఖలు చేశారు. 

ఈడీ కేసులో ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న కవిత తన మైనర్ కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని గత నెల 26న ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అయితే, కొడుకు ఎగ్జామ్స్ కారణంతో కవితకు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 22న కోర్టు విచారణ ప్రారంభించింది. మూడు రోజులపాటు కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ సుదీర్ఘ వాదనలు వినిపించారు‌. బుధవారం ఈడీ వాదనలు ముగించడంతో.. పిటిషనర్ కవిత వాదనలను రాతపూర్వకంగా రెండు రోజుల్లోరీ జాయిండర్ రూపంలో సమర్పిస్తామని ఆమె అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, నితీశ్​ రాణా, మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. ఇందుకు అనుమతించిన కోర్టు.. ఈ బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 7 కు రిజర్వ్ చేసింది‌. దీంతో కవిత తరఫున మోహిత్ రావు తాజాగా రీ జాయిండర్ దాఖలు చేశారు. 

బెయిల్​ మంజూరు చేయండి

‘ఎంత సేపు కవితను నిబంధనలకు అనుగుణంగానే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆమె అరెస్ట్ కు గల కారణాలను వెల్లడించడం లేదు. నిరుడు ఆగస్టు తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు కవితను లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ఒకరోజు ముందు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. బీఆర్ఎస్​ తరఫున ఆమె 2009 నుంచి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. 

ఈ ఎన్నికలకు సైతం కవితను బీఆర్ఎస్ అధిష్టానం ప్రచారకర్తగా ప్రకటించింది’ అని  రీ-జాయిండర్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా 2021లో లిక్కర్ స్కామ్​ బయటకు రాగానే ఇందులో కవిత ప్రమేయం ఉందంటూ ఢిల్లీ బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను ఇందులో మెన్షన్ చేశారు. కేసు దర్యాప్తు మొదలు కాకముందే.. బీజేపీ నేతలకు ఈ విషయాలు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కవితకు బెయిల్ మంజూరు చేయాలని రీజాయిండర్​లో అడ్వకేట్​ మోహిత్​రావు కోరారు.