ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా

ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా
  • నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకుంటరా?: సంజయ్

బోయినిపల్లి, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారా? అని ఆయన సవాల్​ విసిరారు. డేట్.. టైం.. వేదిక మీరే నిర్ణయించండని ఆయన సూచించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లిలో జరిగిన పన్నా ప్రముఖ్ ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎంత మంది మహిళల అకౌంట్లలో రూ.2,500 వేశారు.. ఎంతమందికి రూ.4 వేల ఆసరా పింఛన్ ఇచ్చారు. ఎంతమందికి కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇచ్చారు. ఆడ పిల్లలకు స్కూటీలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఒక్కరికైనా ఇచ్చారా?” అని సంజయ్​ కాంగ్రెస్​ నేతలను ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘జూన్ లోనే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే రుణమాఫీ చేయవచ్చు కదా” అని సజంయ్​ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు గడువు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.500 బోనస్ ఇవ్వడానికే రూ.5,700 కోట్లు లేవు.. మరి రుణమాఫీకి రూ.30 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. 

డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని కట్టిచ్చారో చెప్పాలె..

రాష్ట్రంలో గత  బీఆర్ఎస్ ప్రభుత్వంలో​ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో.. ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిచ్చారో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్​ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. కరీంనగర్​ను తానే స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించానని.. రోడ్లకు నిధులు తెచ్చానని వినోద్​ కుమార్​అబద్ధాలు చెప్తున్నారన్నారు. రాముడి అక్షింతలు పంచితే కడుపు నిండుతదా? అని ఓ వర్గానికి చెందిన మహిళల ఎదుట  కేసీఆర్​ హేళనగా మాట్లాడారని  మండిపడ్డారు. కరీంనగర్ ​కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుకు సీఎం ఎవరో.. పీఎం ఎవరో కూడా  తెల్వదని,  అలాంటి వారికి ఓటు వేయొద్దన్నారు.