
శంషాబాద్, వెలుగు: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల మెదక్ లో ఇరువర్గాల ఘర్షణల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళతానని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని మెదక్ వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.
రాజాసింగ్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రాగానే శంషాబాద్ ఆర్టీఐఏ పోలీసులు ఎస్కార్ట్ ద్వారా ముందుగా గోషా మహల్ లోని ఆయన ఇంటికి తరలించారు. అనంతరం మెదక్ లో జరిగిన అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న మియాపూర్ లోని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.