- రిక్షాపై దరఖాస్తులతో బీజేపీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
- క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ.. గన్ పార్క్ వద్ద ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
రైతుల నుంచి సేకరించిన రుణమాఫీ, ఫసల్ బీమా దరఖాస్తులను రిక్షా బండిపై వేసి తోసుకుంటూ వచ్చారు. అనంతరం గన్ పార్క్ వద్ద రైతు భరోసా, రుణమాఫీ దరఖాస్తులను తలపై మోస్తూ నిరసన తెలిపారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ భీమా యోజనను అమలు చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.
