- బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గతంలో ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు ఎక్కడికీ పోలేదని, అది రద్దు కాలేదని.. కేవలం సాంకేతిక కారణాలతో అమలులో జాప్యం జరుగుతున్నదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చేస్తున్నవన్నీ అర్థం లేని ఆరోపణలని, తమ తప్పులను బీజేపీపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మహిళా బిల్లును గతంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ ప్రవేశపెట్టాయని, అయితే కాంగ్రెస్ హయాంలో ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఆ పార్టీ వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు.
కానీ, 2023లో ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ బిల్లును ఆమోదింపజేశారని చెప్పారు. ఆ సమయంలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే దీన్ని వ్యతిరేకించారని పేర్కొన్నారు. సీతక్క వంటి ఇప్పటికే ఎదిగిన మహిళా నేతలకు రిజర్వేషన్లు అవసరం లేకపోయినా, సామాన్య మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం దక్కాలన్నదే మోదీ లక్ష్యమని వివరించారు. మహిళా బిల్లు అమలులో జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అత్యంత కీలకమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

