రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన్ని మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. అంతకు మునుపు నందిగ్రామ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అఖిల్ గిరి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తీవ్ర కామెంట్స్ చేశారు. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు.. అంటూ ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒకరి అప్పియరెన్స్ చూసి నిర్ణయించకూడదని అఖిల్ గిరి అన్నారు. ఈ నేపథ్యంలో దానికి ఉదాహరణగా చెప్తూ.. మనందరం రాష్ట్రపతి కుర్చీకి గౌరవమిస్తాం.. మరి ఆ రాష్ట్రపతి చూడడానికి ఎలా ఉంటారు.. అని ఆయన అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈ సమయంలో అక్కడున్న వాళ్లంతా ఈలలు, చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించడం గమనార్హం. దీంతో ఈ వీడియోపై పలువురు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు.
