బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్..స్పెషల్ అట్రాక్షన్‌‌గా ‘కమలం పువ్వు’

బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్..స్పెషల్ అట్రాక్షన్‌‌గా ‘కమలం పువ్వు’

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలు జరిగే HICC నోవాటెల్ ప్రాంతాన్ని కాషాయమయం చేశారు. దారి పొడుగునా.. బీజేపీ జెండాలు ఏర్పాటు చేశారు. మోడీ, అమిత్ షా, నడ్డాలతో కూడిన భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. అత్యంత సుందరంగా నోవాటెల్ ను అలంకరించారు. నోవాటెల్ కు వెళ్లే ప్రధాన ఎంట్రెన్ వద్ద ఏర్పాటు చేసిన ‘కమలం పువ్వు’ అందర్నీ ఆకర్షిస్తోంది. భారీ ఎత్తులో దీనిని అందంగా ఏర్పాటు చేశారు. కమలం పువ్వు ఆర్చర్ బాగుందని ఇక్కడకు వచ్చిన వారు కితాబిస్తున్నారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ లో విపరీతమైన ప్రచారం నిర్వహించాలని తలపెట్టింది బీజేపీ. కానీ ముందుగానే మెట్రో పిల్లర్స్, ఇతర ప్రాంతాలను బుక్ చేసుకున్న టీఆర్ఎస్.. హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీంతో పలు చౌరస్తాల్లో బీజేపీ జెండాలు, ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం, ఆదివారం కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ కు వస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, కార్యవర్గ సభ్యులు నగరానికి వచ్చారు. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.