తెలంగాణలో గెలుద్దాం

తెలంగాణలో గెలుద్దాం
  • బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం
  • కుటుంబ, అవినీతి సర్కార్​ను ప్రజలు క్షమించరు
  • రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదు.. 
  • జనం బీజేపీ వైపు చూస్తున్నరు.. బూత్ స్థాయిలో 
  • పార్టీ బలోపేతం కోసం ఫోకస్​ పెట్టాలని సూచన
  • హైదరాబాద్​ నోవాటెల్​లో ప్రారంభమైన 
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, 
  • బీజేపీ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు
  • నేడు తెలంగాణపై కీలక రాజకీయ తీర్మానం!

హైదరాబాద్, వెలుగు: ఉత్తరాదిననే కాకుండా దక్షిణాదిన కూడా బీజేపీని విస్తరిద్దామని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉండికూడా కొందరు రాచరికపు పాలన చేస్తున్నారని, ఎప్పటికీ అధికారం తమదేననే భ్రమలో ఉంటున్నారని కేసీఆర్ సర్కార్ పై పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. ఇది ఎంతో కాలం సాగదని, కుటుంబ పాలనకు చెక్ పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘‘ఇక్కడి ప్రజలు ఏ ఆశయం కోసమైతే ఉద్యమించారో, ఎలాంటి ఆకాంక్షల కోసం ఆత్మబలిదానాలు చేశారో.. ఇప్పుడవి నెరవేరడం లేదు. ప్రజల ఆలోచనకు, ఆశలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. బీజేపీవైపు ప్రజలు చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి పూర్తి సానుకూల వాతావరణం ఉంది” అని పేర్కొన్నారు. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్​లోని  హెచ్​ఐసీసీ నోవాటెల్​లో  శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యాయి.

వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు ప్రధాని మోడీ, రాజ్యసభ బీజేపీ పక్షనేత పీయూష్  గోయల్ మాత్రమే కూర్చున్నారు. సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్  షా, యూపీ సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన మొదటి రోజు సమావేశాలు రాత్రి 9 వరకు కొనసాగాయి. ఇందులో రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడంపైనా చర్చ సాగింది. నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. నేతలకు పలు సూచనలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం, దక్షిణాదిన పార్టీని విస్తరించడం, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలువాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దక్షిణాదిన బీజేపీని విస్తరించడంపై సీరియస్ గా దృష్టి పెట్టామంటే.. ఉత్తరాదిన పార్టీ వీక్ అయినట్లు కాదన్నారు. 

బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయం

దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్​ ముఖర్జీని స్ఫూర్తిగా తీసుకొని మోడీ పాలన సాగిస్తున్నారని, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. సర్జికల్ స్ట్రక్ విషయంలో, కొవిడ్ సందర్భంగా మోడీ తీసుకున్న సాహోసోపేత నిర్ణయాలను కూడా ప్రతిపక్షాలు తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. అయినా ప్రజలు వాళ్ల మాటలను ఏమాత్రం నమ్మలేదన్నారు. మోడీ ఎనిమిదేండ్లు కాదు.. మరో 20 ఏండ్ల పాటు అధికారంలో ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాబోయే రెండేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో నడ్డా స్పషం చేశారు. కాగా, మొదటి రోజు సమావేశాల్లో  రాజకీయ, ఆర్థిక తీర్మానంపై జరిగిన చర్చలో తెలంగాణకు చెందిన పలువురు నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆర్థిక తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడి సర్కార్ అమలు చేయని విషయాన్ని, ఆయుష్మాన్ భారత్ వంటి పేదల ప్రాణాలను కాపాడే పథకాలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేయకుండా అడ్డుకుంటున్న విషయాన్ని ఎండగట్టారు. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం 10 గంటలకు బీజేపీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. దీనికి నడ్డా అధ్యక్షత వహించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్న రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఈ సమావేశం ముందు ఉంచారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. 

నేడు తెలంగాణపై కీలక తీర్మానం?

జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం బీజేపీదే కావాలని పార్టీ నేతలకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ముగింపు సమావేశాల సందర్భంగా ఆదివారం తెలంగాణపై జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక రాజకీయ తీర్మానం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ డిక్లరేషన్  ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు నేతలు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఇప్పుడున్న రాష్ట్ర పాలకులు నెరవేర్చని కారణంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే  ఆ ఆకాంక్షలు  నెరవేరుతాయనే బలమైన విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు ఈ డిక్లరేషన్ ను ప్రకటించాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు.