ప్రతిపక్ష నేతలను చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్

 ప్రతిపక్ష నేతలను చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్

 న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల్లోని కీలకమైన నేతలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో కీలక మీటింగ్ జరిగింది. 

ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ జనరల్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించారు. జాయినింగ్స్ కమిటీ ఇన్ చార్జ్​గా వినోద్ తావ్డేను నియమించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘ఈ కమిటీ ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నేతలు, సిట్టింగ్ ఎంపీలను బీజేపీలో చేర్చుకునే అంశంపై పరిశీలిస్తుంది. ఆయా లీడర్లకు ఉన్న చరిష్మా, ఎన్నికల్లో గెలిచే అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశాల్లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై దృష్టిసారిస్తుంది” అని పేర్కొన్నాయి.

 గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన 160 సీట్లపై కమిటీ స్పెషల్ ఫోకస్ పెడుతుంద ని చెప్పాయి. కాగా, లోక్ సభ ఎన్నికల కోసం విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతను రాధామోహన్ దాస్ అగర్వాల్​కు,  ఎలక్షన్ క్యాంపెయిన్, పబ్లిసిటీ బాధ్యతలను సునీల్ బన్సల్​కు ఇచ్చారు. ఇక, పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై దేశవ్యాప్తంగా కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తూ ప్రచారం బాధ్యతలను దుష్యంత్ గౌతమ్​కు అప్పగించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్, మాన్​సుఖ్ మాండవీయ, పార్టీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.