- అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్
- రూ.900 కోట్లు రిలీజ్ చేయాలి: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పాటు విజిలెన్స్ దాడుల పేరుతో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లను బెదిరించడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తున్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బకాయిల విడుదల కోసం ఇప్పటికే యాజమాన్యాలు సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వచ్చేనెల ఫస్ట్ వీక్లో విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలతో కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల ప్రతినిధులు రమేశ్ బాబు, కృష్ణారావు, రవి కుమార్ తదితరులతో కూడిన బృందం గురువారం బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ ను వేర్వేరుగా కలిసింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ ప్రతినిధులు మాట్లాడారు.
రాష్ట్రంలో 2,500 ప్రైవేటు విద్యాసంస్థలున్నాయని, 15 లక్షల మంది ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఆధారపడి చదువుతున్నారని వివరించారు. నాలుగేండ్లుగా సుమారు రూ.10వేల కోట్ల ఫీజులు బకాయి ఉన్నాయని, దీంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు ఇస్తామని సీఎం, మంత్రులు హామీ ఇచ్చినా.. అమలు కాలేదని పేర్కొన్నారు. తాము సమ్మె నోటీసులు ఇస్తే.. కాలేజీల్లో తనిఖీల పేరుతో విజిలెన్స్ బృందాలను పంపి బెదిరిస్తున్నారని చెప్పారు.
బకాయిలు రిలీజ్ చేయాలి: రాంచందర్ రావు
వెంటనే ఫీజు బకాయిలు రూ.900 కోట్లు రిలీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్టూడెంట్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మేనేజ్మెంట్లు సమ్మె విరమించాయన్నారు. కానీ, దసరా, దీపావళిలోపు చెల్లిస్తామని ఇచ్చిన మాటను సర్కారు నిలబెట్టుకోలేదని చెప్పారు.
