
న్యూఢిల్లీ : అమెరికా బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ కామెంట్లను బీజేపీ తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు మన దేశంపై దాడి అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీని కాకుండా, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా టార్గెట్ చేసేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. జార్జ్ సోరోస్.. మోడీపై వివాదాస్పద కామెంట్లు చేశారు. అదానీ వ్యవహారం.. ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. దీనిపై స్మృతీ ఇరానీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గట్టిగా బదులిచ్చారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన తర్వాత సోరోస్ వంటివాళ్లు మన దేశంపై దాడి చేయడం ప్రారంభించారన్నారు.
మీ ఆటలు ఇక్కడ నడ్వయ్: స్మృతీ ఇరానీ
‘‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను దోచుకున్న జార్జ్ సోరోస్‌ను ఆ దేశం ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు మోడీపై ఆరోపణలు చేయడమే కాకుండా, మన దేశ ప్రజాస్వామ్యాన్ని కూడా నాశనం చేయాలనే తన కోరికను బయటపెట్టిండు. ఇలాంటోళ్లు దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి తమకు నచ్చినోళ్లను అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తారు. అందుకు బిలియన్ డాలర్ల కొద్దీ ఖర్చు పెడతారు. కానీ, అలాంటి ఆటలు మన దేశంలో సాగవు. ఇదేరీతిలో మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నోళ్లను గతంలో ఓడించినం. ఇప్పుడు కూడా అదే పని చేస్తం. ఈ విషయంలో దేశ ప్రజలంతా సోరోస్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలి”అని స్మృతీ ఇరానీ అన్నారు.
ఎన్నికల రిజల్ట్‌ను నిర్ణయించలేరు: జైరాం రమేశ్
సోరోస్ లాంటి వాళ్లు మన దేశంలో ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయలేరని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ‘‘అదానీ వ్యవహారం దేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి దారితీస్తుందా లేదా అనేది ఇక్కడి ప్రతిపక్షాలపై, ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీనికి బిలియనీర్ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్‌తో సంబంధం లేదు”అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.