చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే నేతలు రూ.1.34 లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘డీఎంకే ఫైల్స్’ పేరిట తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధితో పాటు పలువురు డీఎంకే నేతలు, మంత్రుల ఆస్తుల లిస్ట్‌ను రిలీజ్ చేశారు. లిస్టులో సీఎం స్టాలిన్, మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వి.సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగద్రక్షకన్ సహా ఇతరులు ఉన్నారు.
2011 అసెంబ్లీ ఎలక్షన్‌కు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును ఇచ్చేందుకు ఓ కంపెనీ నుంచి రూ.200 కోట్లు లంచం తీసుకున్నారని అన్నామలై ఆరోపించారు. డీఎంకే నేతలకు చెందిన ఈ ఆస్తులన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలో పేర్కొన్నవే అని పేర్కొన్నారు. జర్నలిస్టులు వీటిని వెరిఫై చేసుకోవాలని, వారం తర్వాత ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. అయితే, అన్నామలై ఆరోపణలు జోక్ అని డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి అన్నారు. అవన్నీ ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నవేనని, వాటిలో ఏవైనా తప్పైతే వారి ఎన్నికను ప్రజలు సవాల్ చేయొచ్చన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అవినీతి జరిగితే సీబీఐ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
