ముంబై మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ముంబై కార్పోరేషన్ ఎవరిదంటే..

ముంబై మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ముంబై కార్పోరేషన్ ఎవరిదంటే..

దేశ ఆర్థిక రాజధాని, అత్యంత ధనిక మున్సిపల్ కార్పోరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. జనవరి 15 ఉదయం 7 గంటల నుంచి ప్రారంబమై పోలింగ్.. సాయంత్రం 5.30 కు ముగిసింది. బీజేపీ-మహాయుతి కూటమికి వ్యతిరేకంగా థాక్రే బ్రదర్స్ జట్టుకట్టి పోటీలో నిలిచిన ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్న వేళ.. ముంబై కా రాజా ఎవరనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చాయి.

దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపాయి. ఆ కూటమి 130 కి పైగా వార్డులను గెలుచుకుని కార్పోరేషన్ సొంతం చేసుకుంటుందని ఫలితాలు పేర్కొన్నాయి. 

యాక్సిస్ మై ఇండియా (Axis My India) ప్రకారం బీజేపీ శివసనేన కూటమికి 131 నుంచి 151 వార్డులు వస్తాయని ప్రెడిక్ట్ చేసింది.
జేవీసీ (JVC ) ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ కూటమి 138 వార్డులు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 

2017 తర్వాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో అప్పటితో పోల్చుకుంటే పొత్తులు మారాయి. ఎత్తులు మారాయి. కొత్తగా మరాఠీ గౌరవం అనే అంశం కూడా వచ్చి చేరింది. 

20 ఏళ్ల తర్వాత.. ఒకటైన థ్రాక్రే బ్రదర్స్.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. అంతటి ఆశలను కూడా పెంచుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వీరికి కార్పోరేషన్ వచ్చే అవకాశం లేదని తేల్చేశాయి. 
యాక్సిస్ మై ఇండియా ప్రకారం.. శివసేన (UBT)-ఎంఎన్ఎస్ కూటమి 58-68 వార్డులు గెలుచుకుంటారని అంచనా వేసింది. జేవీసీ ప్రకారం.. 59 వార్డులు వస్తాయని ప్రెడిక్ట్ చేసింది.

ఇక ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(VBA) తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్.. 12 నుంచి 16 వార్డులు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి.

2017తో పోల్చితే తగ్గిన పోలింగ్ శాతం:

2017తో పోల్చితే ఈ సారి పోలింగ్ శాతం తగ్గినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేశ్ వాఘ్మారే తెలిపారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని 28  సంస్థలకు జరిగిన పోలింగ్ లో 50 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. 2017 లో 55-56 శాతం పోలింగ్ నమోదైతే ఈసారి కొస్త తగ్గడం గమనార్హం. BMC ఎన్నికల్లో మొత్త 227 సీట్లకు 17 వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 25 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.