కాంగ్రెస్ ఎప్పుడూ సైన్యం వెంట నిలబడలే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

కాంగ్రెస్ ఎప్పుడూ సైన్యం వెంట నిలబడలే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  •     ఆ పార్టీ నేతలు పాక్, చైనా ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నరు
  •     బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలు పాక్, చైనా దేశాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. భారత సైన్యం దేశం గర్వించేలా జరిపిన ఆపరేషన్ సిందూర్ వంటి మెరుపు దాడులను అవమానించేలా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్​రావు మాట్లాడుతూ.. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఆధారాలు అడిగిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కూడా సైన్యంపై అనుచిత ప్రశ్నలు లేవనెత్తడం దేశభక్తికి విరుద్ధమన్నారు. 

కాంగ్రెస్ ఎప్పుడూ సైన్యం వెంటే నిలబడలేదని, పార్లమెంట్‌‌‌‌లోపల, బయట సైనికులను అవమానించేలా మాట్లాడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత దూషణలను ఖండించారు. బీజేపీ నాయకులపై అసత్య ఆరోపణలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కార్టూన్ క్యారెక్టర్ లా ప్రవర్తించడం మానుకోవాలని కౌశిక్ రెడ్డికి సూచించారు.