కాంగ్రెస్, బీఆర్ఎస్.. తోడు దొంగలు..తొలి విడతలో 300కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

కాంగ్రెస్, బీఆర్ఎస్.. తోడు దొంగలు..తొలి విడతలో 300కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆ రెండు పార్టీలు ‘తోడు దొంగలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉంటూ కాంగ్రెస్‌తో దోస్తీ చేసే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఇక్కడ కేటీఆర్‌ను ఎలా కలుస్తారని, ఎందుకు పొగుడుతారని ప్రశ్నించారు. 

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. బీజేపీని ఎదుర్కోలేక ఈ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు 300కు పైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారని వెల్లడించారు. 

గతంలో పార్టీకి ఒక్క సర్పంచ్ కూడా లేని జనగామలో 2, మహబూబాబాద్‌లో 6, భూపాలపల్లిలో 3, వనపర్తిలో 6, నాగర్‌కర్నూల్‌లో 3 స్థానాల్లో విజయం సాధించామని గుర్తుచేశారు. రాబోయే రెండు, మూడో విడతల్లోనూ ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీజేపీ కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

‘సర్’పై బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో వర్క్ షాప్

సర్ పై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించేందుకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్​ఆఫీసులో మీడియా విభాగం ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ వర్చువల్‌గా పాల్గొని, కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. వాస్తవాలను వివరించారు. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని నేతలకు వినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.