
- హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిర్ణయం
- కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తాన్ని సీబీఐ ఎంక్వైరికీ అప్పగించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించిన అందరినీ సంతృప్తి పర్చలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. కమిటీలో 20 పదవులే ఉన్నాయని, పార్టీ పరంగా 38 జిల్లాలున్నాయని.. దీంతో అందరికీ పదవులు ఇవ్వలేమన్నారు. అందుకే ఉమ్మడి జిల్లాను పారామీటర్‌గా తీసుకున్నట్టు చెప్పారు. కమిటీలో పేరు లేనివారు బాధపడొద్దని, వారిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేలా చేస్తామని వెల్లడించారు. పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని తెలిపారు.
హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిర్ణయం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఐక్యత లేదని, క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వల్ల దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు అత్యధికంగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయమని గుర్తుచేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వద్ద యాంటీ డిఫెక్షన్ నోటీసులు, అప్లికేషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. స్పీకర్ కూడా సమయానుగుణంగా వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దావోస్, మలేషియా, సింగపూర్ పర్యటనల ద్వారా రూ.80 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ పర్యటనల వల్ల ఖర్చు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పెరాలసిస్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సరిగా ప్రారంభించలేదని ఎన్.రాంచందర్ రావు అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస వసతులు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పెరాలసిస్ కొనసాగుతోందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టి పెట్టలేదన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టు తేల్చిందని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బ్యారేజీలపై మాత్రమే విచారణకు అంగీకరించిందన్నారు. ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం కావాల్సినంత యూరియాను అందించినా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రజాకార్ సినిమా చూసిన రాంచందర్ రావు..
రజాకార్ సినిమాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో వీక్షించారు. ఈ సినిమా తెలంగాణ చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించిందని చెప్పారు. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి అభినందనలు తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రజలకు ఈ సినిమాను చూపించేందుకు ప్రయత్నిస్తామన్నారు.