హైదరాబాద్ లో జనవరి 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్ లో జనవరి 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు జాతీయ నేతలు హాజరుకానున్నారు. మరోవైపు ‘వికసిత్ భారత్’ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. మోదీ ఈ పదేండ్లలో ఏ వర్గానికి, ఏ స్కీం కింద ఎలాంటి మేలు చేశారనేది చెప్పనున్నారు. 

ఈ మేరకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల టూర్ షెడ్యూల్ ను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రంలోని మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. ఈ నెల 7న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. 

తర్వాత కేంద్ర మంత్రులు బీఎల్ వర్మ, మహేంద్రనాథ్ పాండే, ఇతర నేతలు రానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం, ప్లానింగ్, ఫైనాన్స్, సభలు, జాతీయ నేతల టూర్ల కో ఆర్డినేషన్.. వీటన్నింటి కోసం వివిధ కమిటీలు వేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నది. వికసిత్ భారత్ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం కూడా పలు కమిటీలు వేసే ఆలోచనలో ఉంది.