ఫీజు బకాయిలు చెల్లించకుంటే సచివాలయం ముట్టడిస్తాం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు

ఫీజు బకాయిలు చెల్లించకుంటే సచివాలయం ముట్టడిస్తాం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయకపోతే విద్యార్థులతో కలిసి సెక్రటేరియేట్​ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు హెచ్చరించారు. బకాయిలు చెల్లిస్తారా లేదా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రకు మద్దతుగా రాంచందర్ రావు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాయిలు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ ను ఏం చేయాలని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతినెలా రూ.500 కోట్లు చెల్లిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పుతారా? అని విమర్శించారు.  

తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సెగ్మెంట్ లో పలు ప్రాంతాల్లో గడపగడపా తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ఇది కేవలం ఉపఎన్నిక మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక అని చెప్పారు.