
హైదరాబాద్,వెలుగు: మహాజన్ సంపర్క్ అభి యాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధానిగా తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొక బహి రంగ సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామన్నారు. నెల రోజుల ప్రోగ్రామ్ లో ప్రముఖులైన వారితో ఇంటరాక్టివ్ సెషన్ లు నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో 250 మందిని సెలెక్ట్ చేస్తామన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సెమినార్లు నిర్వహిస్తామని,. వచ్చే నెల 23న పది లక్షల బూత్ కార్యకర్తలతో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగిస్తారని చెప్పారు. వచ్చే నెల 25 నుంచి 30 వరకు ఇంటింటికీ బీజేపీ ప్రోగ్రాం ఉంటుందని, జూన్ 25న ఎమర్జెన్సీ డే సందర్భంగా ఆనాటి కాంగ్రెస్అరాచకాలను ప్రజలకు వివరిస్తామని యెండల తెలిపారు.