మహిళా బిల్లును కాంగ్రెస్ ఎందుకు పాస్ చేయలే : రాంచందర్ రావు

మహిళా బిల్లును కాంగ్రెస్ ఎందుకు పాస్ చేయలే : రాంచందర్ రావు
  • రాజీవ్ గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలనడం హాస్యాస్పదం: రాంచందర్ రావు

 హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లును విషయంలో రాజీవ్ గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాంచందర్ రావు స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్​లో ట్వీట్ చేశారు. మహిళా హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రంతా అన్యాయాలతోనే నిండి ఉందన్నారు.

పార్లమెంటులో 400 సీట్లకు పైగా భారీ మెజారిటీ ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేక పోయారని రాంచందర్ రావు ప్రశ్నించారు. నాడు ఉన్న మెజారిటీని మహిళా సాధికారత కోసం కాకుండా, షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును నీరుగార్చడానికి ఉపయోగించారని ఆరోపించారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు భరణం పొందే హక్కును కాలరాస్తూ, రాజీవ్ గాంధీ ప్రభుత్వం నాడు సుప్రీం తీర్పునే మార్చివేసిందని పేర్కొన్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును దశాబ్దాల పాటు అడ్డుకున్నది, పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కోసం నిజాయితీగా పని చేస్తున్న మోదీకి నీతులు చెప్పే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. 

గోవధకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి

 రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో, హైదరాబాద్‌లో చట్ట విరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడడం విచారకరమని రాంచందర్ రావు పేర్కొన్నారు.  

బీజేపీలో చేరిన సినీ ప్రముఖులు 

బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు సమక్షంలో గురువారం పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు బీజేపీలో చేరారు. సినీ సెల్ కో కన్వీనర్ వైభవ సూర్య మాట్లాడుతూ.. దేశభక్తి భావజాలం, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆకర్షితులై పలువురు కళాకారులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరినవారిలో ప్రముఖ సినీ నటులు మనోహర్, శరత్, పద్మరేఖ, పూజిత తదితరులున్నారు.