నకిలీ ఓట్ల ఏరివేతకే సర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

నకిలీ ఓట్ల ఏరివేతకే సర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 
  •     ఇది ఎన్నికల సంఘం నిర్ణయం 
  •     పాతబస్తీలో ఒకే ఇంట్లో వందల ఓట్లు ఉన్నాయని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ఓటరు జాబితాను ప్రక్షాళన చేసి, నకిలీ ఓట్లను తొలగించడం ద్వారానే ప్రజాస్వామ్యానికి అసలైన న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా త్వరలో డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుందని, అందులో భాగంగానే ఎన్నికల సంఘం ఎలక్టోరల్ ప్రాసెస్‌లో ‘సర్’ చేపట్టిందని తెలిపారు. నకిలీ ఓట్ల ఏరివేతనే సర్ లక్ష్యమని చెప్పారు. 

బుధవారం హైదరాబాద్​లోని కొండాపూర్‌లో శిల్పా పార్క్ అపార్ట్‌మెంట్స్ నివాసితులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2002 తర్వాత ఇంత భారీ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగలేదన్నారు. అడ్రస్ మారిన వారు, చనిపోయిన వారి పేర్లు ఇంకా లిస్టులో ఉండటంతో ఓటింగ్ శాతం తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం అండతో రోహింగ్యాలు అక్రమంగా ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందుతున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉండడం అనుమానాస్పదమన్నారు. అందుకే ‘డిటెక్ట్ – డిలీట్ –డిపోర్ట్’ అనే లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నారీశక్తి వందన్ అధినియం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. 2029 ఎన్నికల నుంచి ఇది అమలులోకి రానుందని చెప్పారు.