నవంబర్ 2న బీజేపీ మూడో జాబితా...40 నుంచి 45 మందితో లిస్టు.!

నవంబర్ 2న బీజేపీ మూడో జాబితా...40 నుంచి 45 మందితో లిస్టు.!
  • మోదీ ఆధ్వర్యంలో సీఈసీ మీటింగ్ 
  • జనసేనకు ఇచ్చే సీట్లపై నో క్లారిటీ
  • 40 నుంచి 45 మందితో లిస్టు 
  • మోదీ ఆధ్వర్యంలో సీఈసీ మీటింగ్ 
  • జనసేనకు ఇచ్చే సీట్లపై నో క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. గురువారం లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో రాజస్థాన్, తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మూడో విడత జాబితా, జనసేనకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో మొత్తం 53 మందిని ప్రకటించిన బీజేపీ... మరో 66 మందిని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్ లో 40 నుంచి 45 సీట్లపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇంకా 21 సీట్ల వరకు పెండింగ్ లో ఉండనున్నాయి. ఇందులో జనసేనకు 10 సీట్ల వరకు ఇచ్చే అంశంపై మీటింగ్ లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే పవన్ కల్యాణ్ విదేశాల్లో ఉండడంతో..  ఆయన తిరిగి వచ్చిన తర్వాతే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానిపై క్లారిటీ రానుంది. 

హుస్నాబాద్, వేములవాడ పెండింగ్..  

వేములవాడ, హుస్నాబాద్ సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. ఈ రెండు సీట్లపై బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య అభిప్రాయ భేదాలు ఉండడంతో, వాటిని పెండింగ్ లో పెట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. వేములవాడ టికెట్ తుల ఉమకు ఇవ్వాలని ఈటల.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ కు ఇవ్వాలని సంజయ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. హుస్నాబాద్​లో బొమ్మ శ్రీరామ్​కు ఇవ్వాలని సంజయ్.. సురేందర్ రెడ్డికి ఇవ్వాలని ఈటల అడుగుతున్నట్టు తెలిసింది. వేములవాడలో వికాస్​కు టికెట్ ఇవ్వకుంటే తనకే ఇవ్వాలని సంజయ్ కోరినట్టు సమాచారం. ఈటలకు రెండు చోట్ల పోటీకి అనుమతి ఇచ్చినట్టే, తనకూ ఇవ్వాలని అడిగినట్టు తెలిసింది. 

మిగతా అభ్యర్థుల ఎంపిక నేరుగానే.. 

ఈ నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో మిగిలిన అభ్యర్థులను సీఈసీ మీటింగ్ ద్వారా కాకుండా నేరుగానే హైకమాండ్ ప్రకటించనున్నట్టు తెలిసింది.  ఈ నెల 10 వరకు నామినేషన్లకు అవకాశం ఉండడంతో 7, 8 తేదీల వరకు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 10 తర్వాత రాష్ట్రానికి ఢిల్లీ పెద్దలు ప్రచారానికి రానున్నట్లు పేర్కొన్నారు.